హైదరాబాదులో ఈదురుగాలులు, వడగళ్ల వాన బీభత్సం

  • హైదరాబాద్‌లో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన
  • గాలివాన ధాటికి నేలకొరిగిన చెట్లు, విద్యుత్ స్తంభాలు
  • హైదరాబాద్ నగరానికి రాత్రి 7 గంటల వరకు వర్ష సూచన
  • మేడ్చల్, రంగారెడ్డి సహా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ
హైదరాబాద్ నగరంలో ఆదివారం వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి ఎండలు మండిపోగా, మధ్యాహ్నం తర్వాత ఆకస్మికంగా ఆకాశం మేఘావృతమైంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. చాలాచోట్ల వడగళ్లు కూడా పడటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.

ఈదురు గాలుల ధాటికి చింతల్, పద్మనగర్ ప్రాంతాల్లో ఒక భారీ చెట్టు వేర్లతో సహా కూలిపోయింది. దీని ప్రభావంతో రెండు విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఈ ఘటనలో పలు ద్విచక్ర వాహనాలు దెబ్బతిన్నాయి. అయితే, ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ప్రాథమిక సమాచారం. కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, సికింద్రాబాద్, జీడిమెట్ల, కొంపల్లి, దుండిగల్, నిజాంపేట, బాలానగర్ సహా నగరంలోని అనేక ప్రాంతాల్లో వడగండ్ల వాన ప్రభావం చూపింది.

ఇదిలా ఉండగా, హైదరాబాద్‌లో రాత్రి 7 గంటల వరకు భారీ వర్షం కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు, మేడ్చల్-మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, వికారాబాద్ సహా మరికొన్ని జిల్లాలకు యెల్లో అలర్ట్ ప్రకటించింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు.



Hyderabad Rain
Hyderabad weather
Hyderabad
Rain alert
Orange alert
Weather forecast
Heavy rainfall
Hailstorm
Telangana rains

More Telugu News